Isaiah 45

1యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి ఈ విధంగా చెబుతున్నాడు,
<<అతని పక్షంగా రాజ్యాలను జయించడానికి నేను అతని కుడిచేతిని పట్టుకున్నాను.
నేను రాజుల నడికట్లు విప్పుతాను. ద్వారాలు అతని ఎదుట తెరచి ఉండేలా తలుపులు తీస్తాను.

2నేను నీకు ముందు వెళ్తూ ఎత్తైన స్థలాలను చదును చేస్తాను. ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనపగడియలను విరగ్గొడతాను.

3పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకోవాలి.
చీకటి స్థలాల్లో ఉన్న నిధుల్నీ రహస్యంగా దాచి ఉన్న ధనాన్నీ నీకిస్తాను.

4నేను నీకు తెలియకపోయినా నా సేవకుడు యాకోబు కోసం,

నేను ఎన్నుకున్న ఇశ్రాయేలు కోసం నేను నిన్ను పేరుతో పిలిచాను. నీకు బిరుదులిచ్చాను.
5నేను యెహోవాను, మరి ఏ దేవుడూ లేడు. నేను తప్ప ఏ దేవుడూ లేడు.
6తూర్పు నుండి పడమటి వరకూ నేను తప్ప ఏ దేవుడూ లేడని మనుషులు తెలుసుకోనేలా
నువ్వు నన్ను ఎరుగకపోయినా నిన్ను సిద్ధం చేశాను. నేనే యెహోవాను. నేను తప్ప మరి ఏ దేవుడూ లేడు.

7వెలుగును సృజించే వాణ్ణీ చీకటిని కలిగించే వాణ్ణీ నేనే. శాంతినీ, విపత్తులనూ కలిగించే వాణ్ణి నేనే. యెహోవా అనే నేనే వీటన్నిటినీ కలిగిస్తాను.

8అంతరిక్షమా, పైనుండి కురిపించు. ఆకాశాలు నితిన్యాయలు వర్షించనీ.
భూమి విచ్చుకుని రక్షణ మొలకెత్తేలా నీతిని దానితో బాటు మొలిచేలా చెయ్యనీ. యెహోవానైన నేను దాన్ని కలిగించాను.

9మట్టికుండ పెంకుల్లో ఒక పెంకులాటి ఒకడు తనను చేసిన వానితో వాదిస్తే వాడికి బాధ.

బంకమట్టి కుమ్మరితో <నువ్వేం చేస్తున్నావ్?> అనవచ్చా? <నువ్వు చేసినపుడు నీకు చేతులు లేవా?> అనగలదా?

10<నీకు పుట్టినదేమిటి?> అని తన తండ్రినీ, <నువ్వు దేనిని గర్భం ధరించావు?> అని తల్లినీ అడిగే వాడికి బాధ తప్పదు.>>


11ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట చెబుతున్నాడు,

<<జరగబోయే విషయాలకు సంబంధించి, నా పిల్లలను గురించీ, నా చేతి పనులను గురించీ నాకే ఆజ్ఞాపిస్తారా?

12భూమినీ దానిపైనున్న మనుషులనూ సృష్టించింది నేనే. నా చేతులు ఆకాశాలను విశాలపరిచాయి. వాటిలోని సమస్తాన్నీ నా ఆజ్ఞతోనే నడిపిస్తాను.


13నీతిని బట్టి కోరెషును ప్రేరేపించాను, అతని మార్గాలన్నిటినీ తిన్నగా చేస్తాను. అతడు నా పట్టణాన్ని కట్టిస్తాడు,

ఏమీ వెల గానీ, లంచం గానీ పుచ్చుకోకుండానే చెరలో ఉన్నవారిని అతడు విడిపిస్తాడు.>>

14యెహోవా ఈ విధంగా చెబుతున్నాడు<<ఐగుప్తీయుల సంపాదన, కూషు వ్యాపార లాభాలు, నీకు దొరుకుతాయి. ఎత్తుగా ఉండే సెబాయీయులు నీకు లొంగిపోతారు. వారు సంకెళ్ళతో నీవెంట వచ్చి నీకు సాగిలపడతారు. <నిజంగా దేవుడు నీతో ఉన్నాడు, ఆయన తప్ప మరి ఏ దేవుడూ లేడు> అని చెబుతూ నిన్ను వేడుకుంటారు.>>

15రక్షకుడవైన ఇశ్రాయేలు దేవా, నిజంగా నువ్వు నిన్ను కనబడకుండా చేసుకునే దేవుడవు.

16విగ్రహాలు చేసే వారు సిగ్గుపడతారు. వారంతా అవమానం పాలవుతారు. వారిలో ప్రతి ఒక్కడూ కలవరానికి గురవుతాడు.

17యెహోవా ఇశ్రాయేలుకు నిత్యమైన రక్షణ అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు ఇక ఎన్నటికీ సిగ్గుపడరు, అవమానం పాలు కారు.

18ఆకాశాల సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని చేసి, దాన్ని సిద్ధపరచి స్థిరపరిచాడు.

నిరాకారంగా కాక, ఒక నివాసస్థలంగా దాన్ని సృష్టించాడు.
ఆయన ఇలా ప్రకటిస్తున్నాడు. <<యెహోవాను నేనే, మరి ఏ దేవుడూ లేడు.

19ఎక్కడో చీకటిలో రహస్య స్థలం నుండి నేను మాట్లాడలేదు.

అదృశ్యంగా ఉండి, <నన్ను వెదకండి> అని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు.
నేను న్యాయంగా మాట్లాడేవాణ్ణి, యెహోవా అనే నేను యథార్థమైన సంగతులు తెలిపేవాణ్ణి.

20కలిసి రండి, వివిధ రాజ్యాల్లో పరవాసులుగా ఉన్నవారంతా నా దగ్గర సమకూడండి.

చెక్కిన విగ్రహాలను మోస్తూ రక్షించలేని ఆ దేవుళ్ళకు మొరపెట్టేవారు బుద్ధిహీనులు.

21నా సన్నిధిలోకి వచ్చి సంగతులు వివరించండి. ప్రజలు వారిలో వారిని సంప్రదించుకోనీయండి.

పూర్వకాలం నుండీ ఆ కార్యాలను ఎవరు తెలుపుతూ ఉన్నారు?
చాలకాలం కిందటే దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా?
నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను న్యాయవంతుడైన దేవుణ్ణి. నేనే రక్షించేవాణ్ణి. నేను తప్ప మరి ఏ దేవుడూ లేడు.

22భూమి అంచుల వరకూ నివసించే ప్రజలారా, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుణ్ణి నేనే, మరి ఏ దేవుడూ లేడు.

23నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుందనీ, ప్రతి నాలుకా <యెహోవా తోడు> అని అంటుందనీ నేను ప్రమాణం చేశాను.
నా న్యాయ వాక్కు బయలుదేరింది. అది వ్యర్ధం కాదు.

24<యెహోవాలోనే రక్షణ, బలం ఉన్నాయి> అని ప్రజలు నా గురించి చెబుతారు.>>

మనుషులంతా ఆయన దగ్గరకే వస్తారు. ఆయనను వ్యతిరేకించిన వారంతా సిగ్గుపడతారు.
ఇశ్రాయేలు సంతానం వారంతా యెహోవా వలన నీతిమంతులుగా తీర్పు పొంది అతిశయిస్తారు.
25

Copyright information for TelULB